Jagan: సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు: దేవినేని ఉమ
- అందరి ఆమోదంతోనే సీఆర్డీయే చట్టాన్ని రూపొందించాం
- జగన్ రాజకీయ ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారు
- రాష్ట్ర మంత్రులకు వెన్నెముక లేదు
రాజధాని కోసం రూపొందించిన సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు... అసెంబ్లీలో అందరి ఆమోదంతోనే ఈ చట్టాన్ని రూపొందించామని తెలిపారు.
రాజకీయ ఉన్మాదంతో జగన్ ప్రవర్తిస్తున్నారని... తెలుగువారి గుండెలపై తన్నుతున్నారని మండిపడ్డారు. తాను చేయాలనుకుంటున్న తప్పుడు పనులను ఆమోదింపజేసుకోవడానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులెవరికీ వెన్నెముక లేదని ఎద్దేవా చేశారు. రాజధానిని తరలించడం ఎవరి తరం కాదని అన్నారు. విజయవాడలో టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ చెప్పినట్టు విని, తప్పు చేసే అధికారులు రేపు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని దేవినేని ఉమ హెచ్చరించారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై ఆంక్షలు విధించడం దారుణమని అన్నారు. ఇష్టం వచ్చినట్టు 144 సెక్షన్ ను అమలు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి జేఏసీ కార్యాలయానికి తాళం వేయడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. జేఏసీలో వైసీపీ మినహా అన్ని పార్టీలు ఉన్నాయని చెప్పారు.