Amit Shah: సీఏఏలో పౌరసత్వం తొలగించే నిబంధన ఎక్కడుందో చెప్పాలి: విపక్షాలకు అమిత్ షా సవాల్
- మమతా, రాహుల్ లను కోరిన అమిత్ షా
- సీఏఏపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపాటు
కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. అక్కడి ప్రజలే కాదు, ప్రభుత్వం కూడా సీఏఏపై అసంతృప్తితో రగిలిపోతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సందర్భం వచ్చినప్పుడల్లా సీఏఏ విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం జాతీయస్థాయిలో కేంద్రాన్ని తూర్పారపడుతోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు సవాల్ విసిరారు. సీఏఏలో భారతీయుల పౌరసత్వాన్ని తొలగించే నిబంధన ఎక్కడుందో చెప్పాలని అన్నారు.
పౌరసత్వ చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. సీఏఏపై అసత్యప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేతకు గురైన పాకిస్థానీ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మతాల ప్రాతిపదికన దేశాన్ని విభజించిందని విమర్శించారు. ఇప్పుడు పాకిస్థాన్ పశ్చిమ, తూర్పు భాగాల్లో నివసించే మైనారిటీలు (హిందువులు, జైనులు, పార్శీలు, సిక్కులు) భారత్ తిరిగి రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.