Ariane-5: ఏరియన్-5 రాకెట్ ద్వారా త్వరలో నింగిలోకి జీశాట్-30
- జనవరి 17న ఫ్రెంచ్ గయానాలో ప్రయోగం
- అంతరిక్షంలోకి అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం
- ఇన్ శాట్-4ఏ స్థానాన్ని భర్తీ చేయనున్న తాజా శాటిలైట్
మూడు టన్నుల భారీ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఇస్రో సన్నద్ధమవుతుంది. అయితే ఉపగ్రహం బరువు దృష్ట్యా భారత శాస్త్రవేత్తలు ఈసారి విదేశీ రాకెట్ పై ఆధారపడుతున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు ఊతమిచ్చే జీశాట్-30 ఉపగ్రహాన్ని ఏరియన్-5 రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానా నుంచి జనవరి 17న నింగిలోకి పంపనున్నారు. దీని బరువు 3357 కిలోలు. భారత్ లో అత్యాధునిక రీతిలో కమ్యూనికేషన్ వ్యవస్థ నెలకొల్పేందుకు ఇస్రో ఐ3కే పేరిట అనేక కమ్యూనికేషన్ శాటిలైట్లను అంతరిక్షంలో మోహరిస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే ఎంతో కాలం నుంచి సేవలు అందిస్తున్న ఇన్ శాట్-4ఏ ఉపగ్రహం స్థానాన్ని తాజాగా ప్రయోగిస్తున్న జీశాట్-30 భర్తీ చేయనుంది. దీనిలోని సి, కేయూ బ్యాండ్ ట్రాన్స్ పాండర్ల ద్వారా భారత ప్రధాన భూభాగం, సముద్ర జలాల్లోని భారత ప్రాదేశిక దీవులకు మరింత మెరుగైన కమ్యూనికేషన్ సేవలు అందుతాయి. అంతేకాదు, జీశాట్-30లో పొందుపరిచిన మరిన్ని ట్రాన్స్ పాండర్ల సాయంతో గల్ఫ్ దేశాలు, ఇతర ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా కమ్యూనికేషన్ సేవలు అందించే వీలుంటుంది.