Andhra Pradesh: బీజేపీ నేత జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ
- అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ ను కలిసిన పవన్
- మూడు రాజధానుల అంశం, ఏపీ ఆర్థిక పరిస్థితులపై చర్చలు
- భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీచేసే అవకాశం?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు బీజేపీ నేత జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మొన్న ఢిల్లీ వెళ్లిన పవన్ ముందుగా ఆర్ఎస్ఎస్ నేతలను కలిశారు. అనంతరం బీజేపీ ప్రధాన కార్యదర్శి సంతోష్ తోను, ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతోనూ భేటీ అయ్యారు. వీరితో మూడు రాజధానుల అంశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అమరావతికి భూములిచ్చిన రైతుల ఆందోళనలు తదితర అంశాలపై పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికోసం రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలన్న దానిపై కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు, దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇరుపార్టీల నేతలు ప్రాథమిక చర్చలు జరిపారని జనసేన వర్గాలు తెలుపుతున్నాయి.
మొత్తంగా పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతమైందని, పవన్ ఢిల్లీనుంచి ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారని వారు తెలిపారు. త్వరలోనే రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఓ ప్రణాళిక రూపొందించుకుంటాయని రెండు పక్షాల వర్గాలు తెలుపుతున్నాయి. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటేచేసే అవకాశాలున్నాయని సమాచారం.