Dubai: కారులో పర్సు మర్చిపోయిన భారత యువతి.. తెచ్చిచ్చిన పాక్ డ్రైవర్!
- దుబాయ్‌లో ఘటన
- రవాణా శాఖ అధికారులను సంప్రదించి వివరాలు సేకరించిన డ్రైవర్
- ఇంటికెళ్లి అందించి తన నిజాయతీని చాటుకున్న డ్రైవర్
కారులో వెళ్తూ పొరపాటున పర్సు మర్చిపోయి దిగేసిందో యువతి. చాలాసేపటి తర్వాత ఆ వ్యాలెట్‌ను గమనించిన డ్రైవర్ దానిని భద్రంగా తీసుకెళ్లి ఆమెకు అందించాడు. కారులో పర్సు మర్చిపోయిన ఆ యువతి భారతీయురాలు కాగా, పర్సు అందించిన ఆ కారు డ్రైవర్ పాకిస్థానీ కావడంతో ఇప్పుడా వార్త వైరల్ అయింది.
కేరళకు చెందిన రాచెల్ రోజ్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. ఇంగ్లండ్‌లోని లాంక్‌స్టర్ విశ్వవిద్యాలయంలో రాచెల్ లా చదువుతోంది. ఈ నెల 4న తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. కారు డ్రైవర్ పాకిస్థాన్‌కు చెందిన మొదాసిర్ ఖాదిమ్. కారు ఎక్కిన ఆమె.. మార్గమధ్యంలో మరో మరో స్నేహితురాలి కారు కనిపించడంతో ఖాదిమ్ కారు నుంచి దిగి ఆమె కారులో వెళ్లిపోయింది. ఈ క్రమంలో తన పర్సును ఖాదిమ్ కారులో మర్చిపోయింది.
అక్కడి నుంచి వెళ్లిపోయిన ఖాదిమ్ కొంత సేపటి తర్వాత కారులో ఆమె పర్సును గుర్తించి తెరిచి చూశాడు. అందులో రోజ్ యూకే స్టూడెంట్ వీసా, ఎమిరేట్స్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్ కార్డు, వెయ్యి దిర్హమ్‌ల క్యాష్ ఉన్నాయి. దీంతో ఆ పర్సును ఆమెకు అందించాలని ఖాదిమ్ నిర్ణయించాడు. వెంటనే అక్కడి రవాణా శాఖ అధికారులను కలిసి విషయం చెప్పాడు. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా రోజ్ ఇంటికి వెళ్లి ఆ పర్సును ఆమెకు అందించాడు. అతడి గొప్పతనాన్ని గుర్తించిన రోజ్ తండ్రి 600 దిర్హమ్‌లు ఇవ్వగా, తీసుకునేందుకు ఖాదిమ్ నిరాకరించాడు. రోజ్ తన సోదరిలాంటిదంటూ చెప్పి తన గొప్పతనాన్ని చాటిచెప్పాడు.