Donald Trump: ఖరారైన డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన... వచ్చే నెలలోనే!
- వచ్చే వారంలో ఏర్పాట్ల పర్యవేక్షణకు టీమ్
- ఫిబ్రవరి నెలాఖరులో రానున్న ట్రంప్
- పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్ లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని వెల్లడించిన దౌత్య వర్గాలు, వాషింగ్టన్ నుంచి సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్ టీమ్స్ వచ్చే వారంలో ఇండియాకు వచ్చి, ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు తెలిపాయి.
ట్రంప్ పర్యటనపై అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, ఆయన ఇండియాకు రావాలనే భావిస్తున్నట్టు అమెరికా అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కాగా, ఈ సంవత్సరం రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరగా, ట్రంప్ సున్నితంగా తిరస్కరించారు.
ఇదే సమయంలో తాను మరోమారు ఇండియాకు వస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ హామీని జనవరి 7న జరిగిన ఫోన్ సంభాషణల్లో మోదీ ప్రస్తావించినట్టు సమాచారం. ఆ వెంటనే ట్రంప్ భారత పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఈ పర్యటన ఉండవచ్చని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షి ష్రింగ్లా వెల్లడించారు. ఇండియాలో తన పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ట్రంప్ తన టీమ్ కు స్పష్టం చేసినట్టు ఆయన తెలిపారు.
ఇక ఈ పర్యటనలో నవంబర్ 2018 నుంచి ఇరు దేశాల మధ్య పెండింగ్ లో ఉన్న పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జూన్ 2019లో ఇండియాకున్న 'జీఎస్పీ' స్టేటస్ ను అమెరికా రద్దు చేయగా, దాని పునరుద్దరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆపై అమెరికాలో ఇండియా పెట్టే పెట్టుబడులు, యూఎస్ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతులను పెంచే అంశాలపైనా కీలక చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.
వీటితో పాటు ఓ భారీ పౌర విమానయాన ఒప్పందం ఇరు దేశాల మధ్యా కుదరవచ్చని అధికారులు అంటున్నారు. డేటా లోకలైజేషన్ బిల్, ఈ-కామర్స్ నియంత్రణ, ఇండియాలో అమెరికన్ విమానాలకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ అవకాశాలు కల్పించడం తదితరాలపైనా చర్చలు జరిగి నిర్ణయాలు తీసుకోవచ్చని అధికారులు అంటున్నారు.
ఇక ట్రంప్ తో పాటు యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అలీస్ వెల్స్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ మ్యాథ్యూ పొటింగర్ తదితరులు ఇండియాకు వచ్చి ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.