prattipati: అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని మార్పు దిశగా ప్రభుత్వం: ప్రత్తిపాటి పుల్లారావు
- రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు
- పోలీసుల చర్యలను హైకోర్టు తప్పుబట్టింది
- ఈ నెల 20న జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తాం
రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు వెళ్తుండడం దారుణమని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని మార్పు దిశగా ప్రభుత్వం వెళ్తోందని ఆయన చెప్పారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో అమరావతి రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ, వామపక్షాలు, జనసేన, ఆప్ నేతలు పాల్గొన్నారు.
అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. పోలీసుల చర్యలను హైకోర్టు తప్పుబట్టిందని చెప్పారు. ఈ నెల 20న జైల్ భరో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదని, పోలీసులు కూడా తమ చర్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.