nirbhaya: 22న నలుగురు దోషులను ఉరి తీస్తారు.. నా కూతురికి న్యాయం జరుగుతుంది: నిర్భయ తల్లి
- ఉరి నుంచి తప్పించుకోవడానికి పిటిషన్లు వేసిన దోషులు
- సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని నిర్భయ తల్లి ఆశాభావం
- దోషులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతాయని వ్యాఖ్య
నిర్భయ కేసు దోషులను ఈ నెల 22న ఉరిశిక్ష తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడారు. ఉరి నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు దోషులు వేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని ఆమె అన్నారు.
జనవరి 22న వారిని ఉరి తీయడం ఖాయమని, ఆ రోజే తన కూతురు నిర్భయకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతాయని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. దోషులు వేసిన క్యూరేటివ్ పిటిషన్లను ఈ రోజు జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది.