local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు 'సుప్రీం' బ్రేక్!
- స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ
- ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై వివాదం
- ఇటీవల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్ల రిజర్వేషన్ యాభై శాతం దాటకుండా చూడాలంటూ వేసిన రెండు పిటిషన్లను ఈరోజు విచారించిన ఎపెక్స్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కేసు విచారణను పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం స్థానాలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం 176వ నంబరు జీవోను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కర్నూల్ కు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రభుత్వం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేస్తూ స్టేకు నిరాకరించింది.
అదే సమయంలో రిజర్వేషన్లు యాభై శాతం మించడానికి కారణాలపై వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమకిచ్చిన షెడ్యూల్ ప్రకారం జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 వరకు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఫిబ్రవరి 8 నుంచి మార్చి 3 వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
అయితే, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ బిర్రు ప్రతాప్ రెడ్డితోపాటు బి.సి.రామాంజనేయులు అత్యున్నత న్యాయస్థానంలో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.