Pawan Kalyan: రేపు విజయవాడలో బీజేపీ, జనసేన కీలక సమావేశం
- ఇటీవలే పవన్ ఢిల్లీ పర్యటన
- బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని ప్రచారం
- గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఒంటరిపోరాటం చేసిన జనసేన, తాజాగా బీజేపీతో చెలిమి కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అనంతరం రాజకీయ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఏపీలో బీజేపీ, జనసేన అంశాలవారీగా కలిసి పనిచేస్తాయని ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో రేపు విజయవాడలో బీజేపీ, జనసేన అగ్రనేతలు సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు ఎంజీ రోడ్డులోని ఓ హోటల్ లో ఇరు పార్టీల నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, అమరావతి ఆందోళనలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రజాసమస్యలపై పోరాటం, ఇరు పక్షాలు సమన్వయంతో కలిసి పనిచేయడంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
జనసేన తరఫున పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పొలిట్ బ్యూరో సభ్యుడు నాదెండ్ల మనోహర్ చర్చల్లో పాల్గొంటారు. బీజేపీ తరఫున ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. కాగా, జనసేనతో భేటీకి ముందు ఉదయం 9.30 గంటలకు బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. జనసేనతో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించనున్నారు.