India: ఇండియాకు వచ్చిన 'అమెజాన్' సీఈఓ... అపాయింట్ మెంట్ ఇవ్వని నరేంద్ర మోదీ!
- భారత పర్యటనలో ఉన్న జెఫ్
- అపాయింట్ మెంట్ పై స్పందించని పీఎంఓ
- మోదీని కలవకుండానే తిరిగి వెళ్లే అవకాశాలు
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్, ప్రస్తుతం భారత పర్యటనలో ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మాత్రం లభించేలా లేదు. మోదీ అపాయింట్ మెంట్ ను బెజోస్ కోరినప్పటికీ, పీఎంఓ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.
కాగా, జెఫ్ బెజోస్ చేతిలోనే ప్రముఖ ఆంగ్ల పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' ఉంది. ఈ పత్రికలో భారత వ్యతిరేక వార్తలు తరచూ వస్తుంటాయి. ఈ కారణంతోనే బెజోస్ ను కలిసేందుకు మోదీ ఆసక్తిగా లేరని సమాచారం. ఇండియాలో మైనారిటీలు భయం భయంగా బతుకుతున్నారని, జమ్మూ కశ్మీర్ లో ప్రజలకు స్వేచ్ఛ లేదని ఎన్నో కథనాలు వచ్చాయి. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా తప్పుడు కథనాలు 'వాషింగ్టన్ పోస్ట్'లో వస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు కూడా.
ఇదే సమయంలో జెఫ్ బెజోస్ పర్యటనను ఎస్ఎంఈలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెజాన్ కారణంగా తమ బిజినెస్ దెబ్బతింటోందని ఆరోపిస్తున్న చిన్న, మధ్య తరహా వ్యాపారులు, బెజోస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వాలని భావిస్తే, ముందుగా తమను పిలిచి మాట్లాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జెఫ్ బెజోస్ కు మోదీ అపాయింట్ మెంట్ దొరకకపోవడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది.
కాగా, ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్న బెజోస్ మాత్రం, మోదీ ధరించేటటువంటి దుస్తులతో హల్ చల్ చేస్తున్నారు. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. తనను పలకరించే వారితో సెల్ఫీలు దిగుతూ షాపింగ్ చేస్తున్నారు. మరోపక్క, కంపెనీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. బాపూ ఘాట్ ను సందర్శించిన ఆయన, పతంగులను ఎగురవేశారు కూడా. ఏది ఏమైనా ఈ దఫా బెజోస్ కు మోదీ అపాయింట్ మెంట్ లభించదని, మోదీని కలవకుండానే బెజోస్ వెళ్లిపోతారని సమాచారం.