Karnataka: ప్రియునితో కలిసి భర్త హత్య... కేసు బయటకు రాకుండా ఏఎస్ఐతో సంబంధం!
- కర్ణాటకలోని మాండ్యా సమీపంలో ఘటన
- 2017లో భర్త రంగస్వామిని హత్య చేయించిన రూప
- రెండున్నరేళ్లకు రంగస్వామి సోదరికి అనుమానం
- పోలీసుల తాజా విచారణలో వెలుగులోకి కుట్ర
తన ప్రియుడితో సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతని అడ్డు తొలగించుకున్న ఓ యువతి, ఆపై కేసును బయటకు రాకుండా చేసేందుకు స్థానిక ఏఎస్ఐని బుట్టలో వేసుకుని, అతనితోనూ బంధాన్ని కొనసాగించింది. మూడేళ్ల తరువాత ఆమె పాపం బట్టబయలు కావడంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. కర్ణాటకలోని మాండ్యా సమీపంలో సినీ ఫక్కీలో జరిగిన ఈ నేరం పూర్వాపరాల్లోకి వెళితే...
చామరాజనగర్ జిల్లా పరిధిలోని కొళ్లేగాల సమీపంలోని రాళ్ల క్వారీలో టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్న రంగస్వామికి, రూప అనే యువతితో వివాహం జరిగింది. దాజెనగౌడన గొడ్డి గ్రామంలో వీరు కాపురం ఉంటుండగా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో మరో టిప్పర్ డ్రైవర్ ముద్దెగౌడ అనే వ్యక్తి తరచూ వీళ్ల ఇంటికి వస్తూ, పోతూ ఉండటంతో రూపకు దగ్గరయ్యాడు. వీరిద్దరి మధ్యా వివాహేతర బంధం ఏర్పడిన విషయం తెలుసుకున్న రంగస్వామి, తన భార్యను మందలించడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని నిర్ణయించుకుని ప్రియుని సహకారాన్ని కోరింది.
2017, జూలై 4 రాత్రి, భర్త నిద్రిస్తుండగా ప్రియుడి సాయంతో తలపై కర్రతో బలంగా కొట్టి, హత్య చేసి, దొడ్డి చెరువు వద్ద, మట్టి కోసం తవ్విన గుంతలో పూడ్చి పెట్టింది. ఆపై తన భర్త కనిపించడం లేదని రూప, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
పోలీసులు విచారించినా నిజం బయటకు రాలేదు. దాదాపు రెండున్నరేళ్ల తరువాత, రూప, ముద్దెగౌడల సంబంధం, వారిద్దరూ కలిసే ఉంటున్నారని గమనించిన రంగస్వామి సోదరి, మరోసారి పోలీసులను ఆశ్రయించింది. రూప, ఆమె ప్రియుడిపై అనుమానాన్ని వ్యక్తం చేయడంతో, పోలీసులు ఇద్దరినీ మరోసారి గట్టిగా ప్రశ్నించగా, నిజం బయట పడింది. వారిద్దరినీ తీసుకెళ్లి, మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం అవశేషాలను తరలించారు.
ఈ కేసులో మరో మలుపు ఉండటం గమనార్హం. రూపపై స్థానిక పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న ఓ ఏఎస్ఐకి హత్య జరిగిన సమయంలోనే అనుమానం రాగా, నిజం బయటకు రాకుండా ఉండేందుకు అతన్ని బుట్టలో వేసుకుంది. అతనితో కూడా బంధాన్ని కొనసాగించింది. తాజాగా, మొత్తం వ్యవహారం బయటకు రావడంతో, జిల్లా ఎస్పీ స్పందించారు. ఏఎస్ఐ సిద్దరాజుపై కేసు పెట్టి, విచారించాలని ఆదేశించారు. కేసు బయటకు రాకుండా చూసేందుకు సిద్దరాజు తనను శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.