Charula Patel: కన్నుమూసిన భారత క్రికెట్ టీమ్ సూపర్ ఫ్యాన్!
- 87 ఏళ్ల వయసులో చారులా పటేల్ కన్నుమూత
- గత సంవత్సరం చారులాను కలిసిన కోహ్లీ, రోహిత్
- సంతాపాన్ని వెలిబుచ్చిన బీసీసీఐ
చారులా పటేల్... ఈ పేరు గుర్తుండే ఉంటుంది. 87 ఏళ్ల వయసులోనూ భారత క్రికెట్ జట్టులో జోష్ ను నింపడానికి గత సంవత్సరం జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా ఆడిన అన్ని మ్యాచ్ లకూ హాజరయ్యారు. ఈమె అభిమానానికి కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లు ముగ్ధులై, ఆమెను ప్రత్యేకంగా కలిశారు కూడా. ఇటీవల అనారోగ్యం బారిన పడిన ఆమె, కన్నుమూశారు. ఆమె మరణాన్ని కుటుంబీకులు లండన్ లో ధ్రువీకరించారు.
1983లో లండన్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇండియా తరఫున కపిల్ దేవ్ సేన వరల్డ్ కప్ ను తొలిసారిగా దక్కించుకున్న వేళ, చారులా స్టేడియంలోనే ఉన్నారు. భారత సంతతికి చెందిన చారులా, పుట్టింది, పెరిగిందీ విదేశాల్లోనే. 1975 నుంచి బ్రిటన్ లో స్థిరపడిన ఆమె, అంతకుముందు దక్షిణాఫ్రికాలో ఉండేవారు. చారులా మృతిపట్ల బీసీసీఐ సంతాపాన్ని తెలిపింది. ఆమె ఎల్లప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది.