Bichhupali: ఇద్దరే ప్రయాణికులు, రోజువారీ ఆదాయం రూ.20.... ఇదీ ప్రధాని ప్రారంభించిన ఓ రైల్వేస్టేషన్ పరిస్థితి!
- ఒడిశాలో రైల్వేష్టేషన్
- రైల్వే లైన్ ఖర్చు రూ.115 కోట్లు
- ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం
ఎంత చిన్న రైల్వే స్టేషన్ అయినా రోజు మొత్తం మీద వచ్చే ఆదాయం కేవలం రూ.20 అంటే విస్మయం కలగకమానదు. ఇద్దరంటే ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఆ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారట. ఇంతకీ ఆ స్టేషన్ ఉన్నది ఒడిశాలో. బొలంగిర్ జిల్లాలోని బిచ్చుపాలి రైల్వే స్టేషన్ దే ఈ ఘనత. ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించింది ఎవరో కాదు... సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే. ఇటీవల ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ చట్టం ద్వారా ఈ స్టేషన్ గురించిన సమాచారం రాబట్టారు.
బిచ్చుపాలి రైల్వే స్టేషన్ నుంచి రోజు మొత్తం మీద ప్రయాణించేది ఇద్దరేనని, వారి ద్వారా రూ.20 ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు. బొలంగిర్ నుంచి బిచ్చుపాలికి రైల్వే లైన్ వేయడానికి, ఇక్కడ స్టేషన్ నిర్మించడానికి రూ.115 కోట్లు ఖర్చయింది. కానీ స్టేషన్ నిర్వహణకు రోజుకు ఎంత ఖర్చవుతుందో మాత్రం అధికారులు చెప్పలేదు.