India: సెంచరీ ముంగిట అవుటైన ధావన్.. భారీస్కోరు దిశగా భారత్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- 96 పరుగులు చేసి అవుటైన ధావన్
- కోహ్లీ అర్ధసెంచరీ
రాజ్ కోట్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. అయితే 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేన్ రిచర్డ్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 90 బంతులెదుర్కొన్న ధావన్ 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. అంతకుముందు, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 42 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (64 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (14 బ్యాటింగ్) ఆడుతున్నారు. ఆసీస్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొంటున్న కోహ్లీ దూకుడు మీదున్నాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు 2, రిచర్డ్సన్ కు ఓ వికెట్ దక్కాయి.