Andhra Pradesh: తమకు ఆ విభాగమే లేదని మద్రాస్ ఐఐటీ చెబుతోంది... దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి: వర్ల రామయ్య
- బొత్సకు సవాల్ విసిరిన వర్ల
- బోస్టన్ నివేదిక అబద్ధాల పుట్ట అని ఆరోపణలు
- రాజధానిని గద్దలా తన్నుకుపోతున్నారంటూ వ్యాఖ్యలు
ఇటీవలే వచ్చిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికలో అమరావతి ముంపు ప్రాంతమని మద్రాస్ ఐఐటీ తెలిపినట్టు చెప్పారని, ఇదంతా అసత్యాల పుట్ట అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తాము అసలు అమరావతిపై అధ్యయనమే చేయలేదని మద్రాస్ ఐఐటీ చెబుతోందని ఆయన అన్నారు.
ఇలాంటి అధ్యయనాలు చేపట్టడానికి మెటియరాలజీ అనే విభాగం ఉండాలని, మద్రాస్ ఐఐటీలో అలాంటి విభాగమే లేనప్పుడు అధ్యయనం ఎలా చేస్తామని అక్కడి అధికారులు పేర్కొన్నారని వర్ల వివరించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వర్ల ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ముఖ్యమంత్రి గారూ, ఇదెక్కడి చోద్యం?' అంటూ ప్రశ్నించారు.
"మంత్రి బొత్స గారూ! ఇది విన్నారా, ఐఏఎస్ విజయ్ కుమార్ గారూ ఇది విన్నారా! మీరు ఇచ్చిన డబ్బుకు ఆశపడి బోస్టన్ గ్రూప్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. నేను చేసిన ఆరోపణలను కాదని చెప్పే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి? ఇంతమంది మేధావులు ఉన్నారు... ఇప్పుడు చెప్పండి. అమరావతిపై తాము అధ్యయనం చేయలేదని మద్రాస్ ఐఐటీ చెబుతోంది. మరి బోస్టన్ రిపోర్ట్ లో మద్రాస్ ఐఐటీ గురించి ఎందుకు చెప్పారు?
గద్ద కోడిపిల్లను తన్నుకుపోయినట్టు రాజధానిని తన్నుకుపోతున్నారు. అమరావతి అధ్యయనం తాము చేయలేదని రవీంద్ర అనే మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ ఈమెయిల్ ద్వారా సమాధానం చెప్పారు. బొత్స దీనికి ఏం సమాధానం చెబుతారు? బోస్టన్ రిపోర్ట్ లో తప్పుంటే వెనక్కి తెప్పిస్తామన్నారు కదా... దమ్ముంటే వెనక్కి తెప్పించండి!" అంటూ వర్ల సవాల్ విసిరారు.