Andhra Pradesh: ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఆగడాలపై ‘8309887955’కు వాట్సాప్ చేయండి: మంత్రి పేర్ని నాని
- ప్రయాణికులను దోపిడీ చేస్తే చర్యలు తప్పవు
- జనవరి 2 నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై 3132 కేసుల నమోదు
- స్క్రీన్ షాట్ లేదా రాతపూర్వకంగా ఫిర్యాదులు పంపవచ్చు
- ఆర్టీసీ తగినన్ని బస్సులు నడుపుతోంది.. వినియోగించుకోండి
సంక్రాంతి పండగ సందర్భంగా రవాణా సమస్యలపై ప్రజల నుంచి లెక్కలేనన్ని ఫిర్యాదులు వచ్చాయని ఏపీ మంత్రి పేర్ని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 2 నుంచి 16వ తేదీ వరకు ప్రైవేటు బస్సులపై 3132 కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 546 బస్సులను సీజ్ చేశామన్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 202 బస్సులు, విశాఖ జిల్లాలో 198 బస్సులను సీజ్ చేశామని చెప్పారు. అదేవిధంగా కేసుల నమోదులో కూడా కృష్ణా జిల్లా ముందుందన్నారు. కృష్ణా జిల్లాలో 645 బస్సులపై కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 367 బస్సులపై కేసులు నమోదు జరిగాయన్నారు.
సంక్రాంతి పండగకు దాదాపుగా మూడువేలకు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల తిరుగు ప్రయాణంకోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తే 8309887955 నెంబర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని మంత్రి పేర్కొన్నారు. స్క్రీన్ షాట్ పంపుతూ ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీని వినియోగించుకోండని మంత్రి ప్రజలను కోరారు.