MIM: మజ్లిస్ ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్సే: అసదుద్దీన్ ఒవైసీ
- రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయింది
- బీజేపీకి తెలంగాణలో చోటు లేదు
- టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలోకి దిగడం వెనకున్న కారణాన్ని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌తో తమ స్నేహం కొనసాగుతుందని, అయితే, పట్టణ ప్రాంతాల్లో ఏ పార్టీకి ఎంత పట్టు ఉందో తెలుసుకునేందుకే ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మజ్లిస్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన పార్టీ కాదని, అది జాతీయ పార్టీ అని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో ఇద్దరు ఉన్నారని, అదే రాష్ట్రం నుంచి ఓ ఎంపీ కూడా ఉన్నారని గుర్తు చేశారు. బీహార్ అసెంబ్లీలోనూ తమ పార్టీకి ప్రాతినిధ్యం ఉందన్నారు.
గత మునిసిపల్ ఎన్నికల్లో భైంసా మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను చేపట్టినట్టు అసదుద్దీన్ వివరించారు. వికారాబాద్, నిజామాబాద్, కోరుట్లలో వైస్ చైర్మన్ పదవులకు మజ్లిస్ ఎన్నికైందన్నారు. ఈసారి వాటితో పాటు మరిన్ని వార్డులు, డివిజన్లలో విజయం సాధిస్తామని ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు లేవని, మైనారిటీలు సంతోషంగా ఉన్నారన్న ఆయన.. ఆ పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటున్నా, మునిసిపల్ ఎన్నికల్లో ఆ టీఆర్ఎస్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో తమ బలం తమకు ఉందన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని, కాబట్టి మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్సే చాలా చోట్ల తమకు ప్రధాన ప్రత్యర్థి అని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.