KV kamat: కేంద్ర మంత్రివర్గంలోకి 'బ్రిక్స్' బ్యాంక్ ఛైర్మన్ కేవీ కామత్?
- ఆర్థికశాఖ సహాయ మంత్రి పదవి లభించే అవకాశం
- స్వప్నదాస్ గుప్తాకు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పదవి
- సురేశ్ ప్రభుకు కూడా మంత్రి వర్గంలో చోటు
బ్రిక్స్ దేశాలకు చెందిన న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ఛైర్మన్ కేవీ కామత్ కేంద్ర మంత్రి వర్గంలోకి రానున్నారు. ఆయనకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పదవి లభించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్రమంత్రి మండలిలో మార్పులు చేర్పులు జరుపనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కామత్ తో పాటు, బీజేపీ ఎంపీ స్వప్నదాస్ గుప్తాకు కూడా మంత్రి పదవి లభించనుందనీ, ఆయనకు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పదవి రావచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సురేశ్ ప్రభుకు కూడా మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో కామత్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం జరుగుతోందని ఢిల్లీ వర్గాల భోగట్టా. ఇక కామత్ అనుభవం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన బ్రిక్స్ కూటమి దేశాల బ్యాంక్ ఛైర్మన్ గా పనిచేస్తూ విజయపథంలో ముందుకు సాగుతున్నారు. గతంలో ఆయన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కు ఛైర్మన్ గా పనిచేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎండీ, సీఈవో గా కూడా పనిచేశారు.