Andhra Pradesh: టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు... పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని విప్ జారీ
- చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం
- అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
- వ్యక్తిగత కారణాలతో రాలేకపోయామన్న నేతలు
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు టీడీఎల్పీ సమావేశం షురూ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. కాగా, ఈ కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్, అశోక్, అనగాని భవాని హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేకపోతున్నామని పార్టీకి సందేశం పంపారు. ఈ భేటీకి గైర్హాజరైన ఐదుగురు ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున, పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. విప్ పరిధిలోకి రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలను కూడా తీసుకువచ్చారు. విప్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది.