Andhra Pradesh: పులివెందుల పులీ, నువ్వు సిగ్గుపడాలి... నీలా ఎవరూ డమ్మీ కాన్వాయ్ తో వెళ్లడంలేదు: దేవినేని ఉమ
- సీఎం జగన్ పై విమర్శలు గుప్పించిన ఉమ
- మీడియా సమావేశంలో విసుర్లు
- విశాఖలో 52 వేల ఎకరాలు చేతులు మారాయన్న ఉమ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సీఎం జగన్ పైనా, వైసీపీ నేతలపైనా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భూములు కొట్టేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో కూడా భూములు లాగేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారని, ఇక్కడ వాళ్ల పప్పులు ఉడకలేదు కాబట్టి, విశాఖపట్నం వెళుతున్నారని ఆరోపించారు.
"జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డీసీపీ రంగారెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముగ్గురూ కలిసి విశాఖలో ఉన్న గయాలి భూములకు ఎసరుపెట్టారు. ప్రతి శనివారం జాయింట్ కలెక్టర్ నిర్వహించే కార్యక్రమంలో వేల ఎకరాల భూములు కొట్టేస్తున్నారు. విశాఖలో 52 వేల ఎకరాలు చేతులు మారాయి. ఈ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, అమ్ముకోవడానికే జగన్ రాజధానిని విశాఖ తరలిస్తున్నాడు. సీఎం జగన్ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని అనేక దఫాలుగా కలవడం వెనుక భూదందా దాగి వుంది. తాను అమరావతిని చంపేస్తానని, అదే సమయంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వలు, ఆరు కాయలుగా ఎదగడానికి దోహదం చేస్తానని చెబుతున్నాడు.
ఇప్పుడు మూర్ఖత్వంతో, మొండిగా వ్యవహరిస్తూ పది వేల మంది పోలీసులను రాజధానిలో మోహరిస్తున్నాడు. ఈ పులివెందుల పులి తాడేపల్లి రాజప్రాసాదం నుంచి సచివాలయానికి వెళ్లడానికి డమ్మీ కాన్వాయ్ ఉపయోగిస్తున్నాడు. సిగ్గుపడాలి... పులివెందుల పులీ, దేశచరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా నీలాగా డమ్మీ కాన్వాయ్ లో సెక్రటేరియట్ కు వెళ్లడంలేదు, అసెంబ్లీకి వెళ్లడంలేదు. నువ్వు ఈ విషయంలో కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతావు.
తాడేపల్లి రాజభవనం నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు రాత్రికిరాత్రే కొత్త రోడ్లు వేస్తున్నారంటే సిగ్గుపడాలి జగన్ మోహన్ రెడ్డీ! రాజధాని రైతులకు భయపడి సచివాలయానికి వెళ్లేటప్పుడు వలలు అడ్డుపెట్టుకుని వెళ్లావు. పాలబూతులు, మెడికల్ షాపులు కూడా మూసివేశారు. నీ పరిస్థితి ఈ విధంగా ఉంది. పెద్ద బడాయి కబుర్లు చెబుతున్నావు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు రేపు ప్రతి ఒక్కరూ రోడ్లపైకి రావాలి. టీడీపీ కుటుంబ సభ్యులారా ఈ కార్యక్రమానికి మద్దతుగా కదలండి" అంటూ పిలుపునిచ్చారు. అయితే అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదంటూ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని, ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని ఉమ స్పష్టం చేశారు.