Fox: తమిళనాడులో అమానుషం... నక్కతో జల్లికట్టు... సీరియస్ అయిన అధికారులు!
- వల వేసి నక్కను పట్టిన యువకులు
- మారియమ్మన్ ఆలయంలో పూజల అనంతరం జల్లికట్టు
- 11 మందిపై కేసు పెట్టిన అధికారులు
సంక్రాంతి సీజన్ లో తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఎంత వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో సేలం జిల్లా వాళపాడి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 200 సంవత్సరాలుగా నక్కలతో జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీ. అయితే ప్రభుత్వం గతంలోనే నక్కలతో జల్లికట్టు పోటీలను పూర్తిగా నిషేధించింది. అయినా, వాళపాడి గ్రామస్థులు తమ సంప్రదాయాన్ని వీడలేదు. గుంటనక్కలను పట్టుకుని వచ్చి, వాటిని అలంకరించి, జల్లికట్టును నిర్వహించారు.
ఈ ఘటన చిన్నమనాయకన్ పాళయంలో జరిగింది. జల్లికట్టుకు ముందు డప్పు వాయిద్యాలతో గుంట నక్కను గ్రామంలో ఊరేగించి, ఆపై స్థానిక మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సీరియస్ అయి, 11 మందిపై కేసులు నమోదు చేసి, వారికి రూ. 55 వేల జరిమానా విధించారు.
కాగా, గ్రామ యువకులు సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్క కోసం వల వేశారని, వలలో నక్క చిక్కుకోగా, తీసుకుని వచ్చి జల్లికట్టు నిర్వహించారని అధికారులు తెలిపారు. వారిపై అటవీ చట్టం కింద కేసు నమోదు చేశామని అన్నారు.