Amaravati: అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నారు.. వివరాలు ఇవిగో!: ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన
- పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహనరావులకు భూములు
- విక్రమసింహ పేరుమీద పయ్యావుల భూమి కొనుగోలు
- జీవీఎస్ ఆంజనేయులు భారీ మొత్తం భూముల కొనుగోలు
- పరిటాల సునీత కుమారుడి పేరు మీద భూములు
టీడీపీ నేతలు రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం చేశారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహనరావులకు భూములున్నాయని చెప్పారు. యనమల వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయని అన్నారు. విక్రమసింహ పేరుమీద పయ్యావుల భూమి కొనుగోలు చేశారని వివరించారు.
జీవీఎస్ ఆంజనేయులు భారీ మొత్తం భూములు కొనుగోలు చేశారని బుగ్గన తెలిపారు. 40 ఎకరాలకు పైగా భూములను జీవీఎస్ ఆంజనేయులు కొనుగోలు చేశారని అన్నారు. వేమూరి రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్లపై భూములున్నాయని చెప్పారు. పరిటాల సునీత కుమారుడి పేరు మీద భూములున్నాయని తెలిపారు. ధరణికోటలో ఆమె కుటుంబ సభ్యులు భూములు కొన్నారని చెప్పారు.
మాజీ టీటీడీ ఛైర్మన్ కుమారుడు పుట్ట మహేశ్ యాదవ్ పేరుతో భూమి కొనుగోలు చేశారని బుగ్గన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గొప్ప నగరాలు కట్టగలమా? అని నిలదీశారు. భావితరాలు నష్టపోయేలా గత ప్రభుత్వం స్కెచ్ వేసిందని ఆరోపించారు.