Anil Ravipudi: ఆ సంఘటన నన్ను బాగా భయపెట్టింది: దర్శకుడు అనిల్ రావిపూడి
- మా ఫ్రెండ్ ను దింపడానికి వెళ్లాను
- చీకట్లో తిరిగి రావలసి వచ్చింది
- సమాధుల దగ్గరే బైక్ ఆగిపోయిందన్న అనిల్ రావిపూడి
'సరిలేరు నీకెవ్వరు' సినిమాను సంక్రాంతి బరిలో విజేతగా నిలిపిన అనిల్ రావిపూడి, ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కాలేజ్ రోజుల్లో జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని గురించి ప్రస్తావించాడు. "అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. మా స్నేహితుడిని తన ఊళ్లో దిగబెట్టడానికి మా ఊరు నుంచి బైక్ పై వెళ్లాను. వాడిని ఊళ్లో దిగబెట్టడానికి వెళ్లేటప్పుడు నాకు ఏమీ అనిపించలేదు. కానీ తిరిగి వచ్చేటప్పటికి చీకటి పడింది.
ఆ ఊరి నుంచి మా ఊరికి పొలాల మధ్య గల దారిలో నుంచి రావాలి. అక్కడ కొన్ని సమాధులు వున్నాయి. అవి చూడగానే .. నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన దెయ్యాల కథలు గుర్తుకు వచ్చాయి. అంతే.. భయం పట్టుకుంది .. బైక్ పై స్పీడ్ గా ఆ సమాధులను దాటేసి వద్దామనుకుంటే, ఆ రోడ్డంతా గతుకులమయం. ఆ సమాధుల దగ్గరికి రాగానే బైక్ ఆగిపోయింది. ఎలాగో అలా తిప్పలు పడుతూ అక్కడి నుంచి బయటపడ్డాను. అప్పుడు నేను పడిన భయం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చాడు.