Andhra Pradesh: శాసనమండలిని రద్దు చేయబోతున్నారంటూ ప్రచారం.. యనమల, లోకేశ్ స్పందన
- శాసనమండలిలో వైసీపీకి లేని సంఖ్యాబలం
- సభ ఆమోదం పొందలేకపోతున్న బిల్లులు
- మండలిని రద్దు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
ఏపీ శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటంతో వైసీపీ ప్రభుత్వం పెడుతున్న బిల్లులన్నీ ఆమోదం పొందుతున్నాయి. మరోవైపు, శాసనమండలిలో విపక్ష తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. వీరితో పాటు బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు. దీంతో, మండలిలో బిల్లులు పాస్ కావడం లేదు. ఈ నేపథ్యంలో, శాసనమండలిని ప్రభుత్వం రద్దు చేయబోతోందనే వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టీడీపీ నేతలు యనమల, నారా లోకేశ్ స్పందించారు.
శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని యనమల వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేయాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉందని అన్నారు. కేవలం పార్లమెంటు నిర్ణయంతోనే శాసనమండలి రద్దు సాధ్యమవుతుందని చెప్పారు. ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అన్నారు.
ఈ అంశంపై నారా లోకేశ్ స్పందిస్తూ, మండలిని రద్దు చేస్తామంటే భయపడేది లేదని చెప్పారు. మండలిని రద్దు చేసే అధికారం వైసీపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. మండలి రద్దుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ కేవలం తీర్మానం మాత్రమే చేయగలదని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా మండలిలో తాము కూడా తీర్మానం చేయగలమని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించాలని తాము కోరుతుంటే... ప్రభుత్వం మాత్రం మండలి రద్దు అంటోందని మండిపడ్డారు.