Pawan Kalyan: ఒళ్లంతా మదమెక్కితేనే ఇలాంటి పనులు చేస్తారు: పవన్ కల్యాణ్
- మహిళలపై లాఠీఛార్జ్ కంటతడి పెట్టిస్తోంది
- వైసీపీది ఫ్యాక్షనిస్టు సంస్కృతి అని ముందు నుంచి చెబుతున్నా
- కులాలు, వర్గాలుగా విడిపోయి బతుకుతున్నాం.. మన దరిద్రం ఇదే
అమరావతి మహిళలు రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే పోలీసులు పాశవికంగా దాడి చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రైతులు, మహిళలపై జరిగిన లాఠీచార్జీ కంటతడి పెట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచులపై పోలీసుల దాడిని తాను మర్చిపోనని చెప్పారు. వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు ఆచరిస్తున్నారని విమర్శించారు. దివ్యాంగులు అనే కనికరం కూడా లేకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేశారని దుయ్యబట్టారు. ఒళ్లంతా మదమెక్కితేనే ఇలాంటి పనులు చేస్తారని మండిపడ్డారు. మంగళగిరిలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీది ఫ్యాక్షనిస్టు, రౌడీ సంస్కృతి అని... మొదటి నుంచి తాను ఇదే విషయాన్ని చెబుతున్నానని పవన్ అన్నారు. అమరావతి రాజధానిగా గత ప్రభుత్వ హయాంలో అన్ని పార్టీలు సమష్టిగా నిర్ణయం తీసుకున్నాయని... ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ఒక సామాజికవర్గం అంటూ, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ... ఇన్ని కులాలను, ఇంత మందిని క్షోభ పెట్టారని మండిపడ్డారు. భవిష్యత్తులో వైసీపీ ఉండకూడదని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి నుంచి తరలిపోదని రైతులకు హామీ ఇస్తున్నానని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు అమరావతి ఆందోళనలకు మద్దతివ్వాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో అక్కడి ప్రజలంతా ఏకమయ్యారని... మన దరిద్రం ఏమిటంటే... మనమంతా కులాలు, వర్గాలుగా విడిపోయి బతుకుతున్నామని పవన్ అన్నారు. ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. వైసీపీకి భవిష్యత్తు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.