Andhra Pradesh: గిచ్చుతున్నారని మహిళలు చెబితే ఏంటో అనుకున్నాను... నన్ను పుండ్లు పడేట్టు గిచ్చారు: గల్లా జయదేవ్
- టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విడుదల
- పోలీసుల దాష్టీకంపై మీడియాకు వెల్లడి
- జిల్లా అంతా చూపించారని సెటైర్
రాజధాని అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన తనపై పోలీసుల దౌర్జన్యం చేశారంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. బెయిల్ పై గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ, తనను గోళ్లతో రక్కేశారని, చొక్కా చించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు కూడా ఊడిపోయాయని వెల్లడించారు.
"మమ్మల్ని అరెస్ట్ చేశారా, నిర్బంధించారా అంటే పోలీసులు సమాధానం చెప్పలేదు. వైద్య సాయాన్ని కూడా అందించలేదు. నరసరావుపేట పీఎస్ లోనే మూడు గంటల పాటు ఉంచారు. స్టేషన్ బయట జనాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రొంపిచెర్ల తీసుకెళ్లారు. అక్కడ మరో రెండు గంటలు ఉంచారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. జనాలు భారీగా వస్తుండడంతో మళ్లీ అక్కడి నుంచి తరలించి గుంటూరు జిల్లా అంతా సైట్ సీయింగ్ చూపించారు.
కాకాని వద్ద మరో నాలుగు గంటలు ఆపేశారు. ఉదయం 11 గంటల నుంచి మొదలుపెడితే 15 గంటలు పట్టింది వారు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అప్పటివరకు వారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో, నిర్బంధిస్తున్నారో కూడా చెప్పలేదు. ఒక ఎంపీతో ఇలా వ్యవహరిస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే భయంకరం మరొకటి ఉండదు.
మొన్న రాజధాని మహిళలు తమను పోలీసులు గిచ్చుతున్నారని చెబితే ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడర్థమైంది... మామూలుగా గిచ్చడం కాదు, పుండ్లు పడేట్టు గిచ్చుతున్నారు. ఇలా చేస్తోంది పోలీసులు కాదు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో చేయిస్తున్నారు. వాళ్లు కేంద్ర బలగాలకు చెందినవాళ్లు కాబట్టి వారిపై యాక్షన్ తీసుకోలేమని చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు" అంటూ మండిపడ్డారు.