Nadendla Bhaskerrao: మండలిని రద్దు చేయాలనుకుంటే పెద్ద దెబ్బతినే అవకాశం ఉంది: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు
- మండలిని రద్దు చేయాలనడం చిన్నపిల్లల ఆటలా ఉంది
- కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండానే నిర్ణయమా?
- ఇలాంటి విషయాలను ఆషామాషీగా తీసుకోవద్దు
ఏపీ శాసనమండలిని రద్దు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వెలువడుతున్న వార్తలపై రాజకీయపార్టీల నేతల భిన్న స్పందనలు ఇప్పటికే వెలువడ్డాయి. తాజాగా, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు స్పందిస్తూ, ఆ యోచన చిన్నపిల్లల ఆటలా ఉందని విమర్శించారు. ఆంధ్రుల చరిత్ర ఎలా అయిపోయిందా అని బాధగా ఉందని అన్నారు.
శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం లభించకపోతే ఇప్పటికిప్పుడు మండలిని రద్దు చేస్తామనడం తొందరపాటు చర్యగా ఉందని అన్నారు. శాసనమండలి రద్దు చేయాలన్న యోచన విషయమై ప్రధానితో గానీ, కేంద్ర హోం మంత్రితో గానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండానే ఈ నిర్ణయం తీసుకోవాలనుకోవడం కరెక్టు కాదని అన్నారు. తొందరపాటు చర్యల వల్ల పెద్ద దెబ్బతినే అవకాశం ఉందని, ఇలాంటి విషయాలను ఆషామాషీగా తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు.