NTR: ‘కౌన్సిల్ ఎందుకు బ్రదర్? అక్కడ నన్ను రోజూ తిడుతున్నారు!’ అని నాడు ఎన్టీఆర్ నాతో అన్నారు : నాదెండ్ల భాస్కరరావు

  • ఆరోజున మండలి రద్దు వెనుక కారణాలు లేవు
  • ఆ తర్వాత మళ్లీ కౌన్సిల్ ఏర్పాటు అయింది
  • అలాంటి తొందరే, ఇప్పుడు కూడా కనపడుతోంది

ఏపీలో శాసనమండలిని రద్దు చేయాలన్న ప్రభుత్వ యోచనపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు స్పందించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సీఎంగా ఉన్న సమయంలో శాసనమండలిని రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

‘కౌన్సిల్ ఎందుకు బ్రదర్? అక్కడ నన్ను రోజూ తిడుతున్నారు’ అంటూ నాడు శాసనమండలిని ఎన్టీఆర్ రద్దు చేశారని, తొందరపాటు నిర్ణయాలు ఇలాగే ఉంటాయని అన్నారు. ఆరోజున శాసనమండలిని రద్దు చేయడం వెనుక ఎటువంటి కారణాలు లేవని చెప్పారు. అలాంటి తొందరే, ఇప్పుడు కూడా కనపడుతోందని అభిప్రాయపడ్డారు. నాడు శాసనమండలిని ఎన్టీఆర్ రద్దు చేసిన తర్వాత మళ్లీ తెచ్చుకున్నారని, అందుకే, ప్రభుత్వ వ్యవహారాల్లో తొందరపాటు చర్యలు ఉండకూడదని సూచించారు.

శాసనసభకు తెలివిగల వాళ్లు, చదువుకున్న వాళ్లు, పెద్దవాళ్లందరూ రాలేరు కనుక శాసనమండలిని సృష్టించారని, అసెంబ్లీ, కౌన్సిల్ ను మిళితం చేస్తే చక్కటి నిర్ణయాలు వస్తాయి కనుక, మండలిని పోగొట్టుకోకూడదు అని సూచించారు. రాష్ట్రం అంటే నైజాం నవాబు ఆస్తా? ఐదు కోట్ల ప్రజానీకానిది అని, తొందరపడకుండా శాంతంగా ఆలోచించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

  • Loading...

More Telugu News