Jharkand: ఇంటి ముందు ఆడుకుంటున్న బిడ్డ మాయమై, రెండేళ్ల తరువాత కనిపిస్తే... సినిమాను తలపించే రియల్ స్టోరీ ఇది!
- రెండేళ్ల క్రితం బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు
- తనకు దొరికితే తీసుకుని వెళ్లి పెంచిన మరో తల్లి
- బిడ్డను పెంచలేక ఓ సామాజిక కార్యకర్త వద్ద మొర
- అతని చొరవతో కన్న తల్లి వద్దకు బిడ్డ
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా వెళ్లి, తిరిగి రెండేళ్ల తరువాత మళ్లీ వారి వద్దకే చేరితే... పలు ట్విస్టులు అందులో చోటు చేసుకుంటే.. ఇలా సినిమా కథను తలపించే ఈ రియల్ స్టోరీ ఝార్ఖండ్ లో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని పండారా పోలీస్ స్టేషన్ పరిధిలో తన బిడ్డ కనిపించడం లేదని ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, బిడ్డ కోసం వెతికి, ఆమె కనిపించడం లేదని కేసును మూసివేశారు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది.
2018, జనవరిలో పండారాలోని దేవ్ నగర్ ప్రాంతానికి చెందిన మనోజ్ లోహ్రా భార్య బిరసా దేవి కట్టెలు కొనేందుకు తన ఆరేళ్ల కూతురుతో వెళ్లిగా, ఆ మార్కెట్ లో చిన్నారి అదృశ్యమైంది. కుమార్తె కోసం గాలించిన వారు, ఆమె కనిపించక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో రోడ్డుపై నిలబడి ఏడుస్తూ ఉన్న ఆ బాలిక బన్హోరాకు చెందిన సునీత అనే మహిళకు కనిపించింది.
బాలికను ఇంటికి తీసుకుని వెళ్లిన సునీత, ఆ పాపను, తన ముగ్గురు కుమార్తెలతో సమానంగా పెంచింది. బాలిక తల్లిదండ్రుల ఆచూకీ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసింది. ముగ్గురు కుమార్తెలతో పాటు, నాలుగో అమ్మాయిని పెంచడం తనకు భారంగా ఉందని, ఓ స్థానిక సామాజిక కార్యకర్త వద్ద ఆమె ఇటీవల వాపోవడంతో, అతను మొత్తం వ్యవహారాన్ని ఆరా తీశాడు.
పోలీసులకు విషయం చెప్పి, తప్పిపోయిన బాలికల జాబితాను వెలికితీసి, సునీత వద్ద ఉన్న పాప తల్లిదండ్రులను గుర్తించి, ఆమెను ఎనిమిదేళ్ల వయసులో సొంత తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. బిడ్డను అప్పగించే సమయంలో పోలీసు స్టేషన్ లో కన్న తల్లి, పెంచిన తల్లి భావోద్వేగాలకు లోనయ్యారు.