Asaduddin Owaisi: నేను ఎర్రని కారం మిర్చిలాంటివాడిని: అసదుద్దీన్ ఒవైసీ
- పౌరసత్వ సవరణ చట్టంపై నాతో మాట్లాడాలి
- ముస్లింలు ఆపదలో ఉంటే ఏ పార్టీ కూడా పరామర్శకు రాదు
- నా పేరుతో చర్చలు నిర్వహించి టీఆర్పీలు పెంచుకుంటున్నారు
కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక అశోక్‌నగర్‌లో మాట్లాడిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. తానెలాంటి వాడినో చెప్పారు. తాను తియ్యని హల్వాలాంటి వాడిని కాదని, ఎర్రని కారం మిర్చిలాంటి వాడినని అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్లకు ఈ ఎన్నికలు రెఫరెండం కాదన్నారు.
ముస్లింలు ఆపదలో ఉన్నప్పుడు ఏ లౌకిక పార్టీ పరామర్శించేందుకు రాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై రాహుల్ గాంధీ, మమతా బెనర్జీతో కాదని, అమిత్ షాకు దమ్ముంటే తనతో మాట్లాడాలని ఒవైసీ సవాలు విసిరారు. కొన్ని టీవీ చానళ్లు తన పేరుతో చర్చా కార్యక్రమాలు నిర్వహించి టీఆర్పీలు పెంచుకుంటున్నాయని, అయినా తనకొచ్చిన ఇబ్బందీ ఏమీ లేదని ఒవైసీ పేర్కొన్నారు.