Andhra Pradesh: ఈ యువకుడికి ఉన్న తెలివిలో అణువంతైనా జగన్ కు ఉంటే ఈ దౌర్భాగ్యపు స్థితి వచ్చేది కాదు: లోకేశ్
- అభివృద్ధిపై తనదైన శైలిలో లోకేశ్ స్పందన
- ఓ సామాన్యుడి అభిప్రాయాలతో కూడిన వీడియో ట్వీట్
- అభివృద్ధిపై స్పష్టంగా మాట్లాడిన యువకుడు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ రాజధాని తరలింపుపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. అభివృద్ధిపై ఓ సామాన్య యువకుడి అభిప్రాయాలను వీడియో రూపంలో ట్వీట్ చేశారు. ఆ యువకుడికి ఉన్న తెలివిలో అణువంతనైనా జగన్ కు ఉండుంటే ఈ దౌర్భాగ్యపు స్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఆ వీడియోలో మాట్లాడిన యువకుడు రాజధాని, అభివృద్ధిపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెలిబుచ్చాడు.
ఓ ప్రభుత్వ ఆఫీసు తరలించినంత మాత్రాన అక్కడ అభివృద్ధి జరగదని, అందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఉదాహరణ అని తెలిపాడు. తమ చిన్నప్పటి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే ఉన్నాయని, ఇకముందూ అలాగే ఉంటాయని, కానీ నిన్నమొన్న వచ్చిన సైబరాబాద్, హైటెక్స్ భారీస్థాయిలో అభివృద్ధి చెందాయని వివరించాడు. అక్కడ ప్రయివేటు సంస్థలు భారీగా రావడంతో ఉద్యోగాల కల్పన కూడా అదే స్థాయిలో జరిగిందని, తద్వారా అత్యంత వేగంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నాడు.