Pawan Kalyan: వైజాగ్ నుంచి రిపబ్లిక్ డే పరేడ్ ను మార్చారు.. అమరావతి కూడా అంతే.. అంత ఈజీ కాదు: ఢిల్లీలో పవన్ కల్యాణ్
- అమరావతే శాశ్వత రాజధాని
- కేంద్ర ప్రభుత్వానికి మూడు రాజధానులతో సంబంధం లేదు
- వైసీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే
ఏపీ శాశ్వత రాజధాని అమరావతేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకలను విశాఖలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్న ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గిందని... మళ్లీ విజయవాడలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. అమరావతి కూడా అంతేనని... రాజధానిని మార్చడం చెపుతున్నంత సులువు కాదని అన్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వ పనితీరు మాత్రం మారలేదని పవన్ అన్నారు. టీడీపీ, వైసీపీలు రెండూ రెండేనని చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తో జరిగిన సమావేశంలో పలు అంశాలను చర్చించామని తెలిపారు. కేంద్రం నుంచి ఎన్నో నిధులు వస్తున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో ఉపయోగించడం లేదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి చెప్పే రాజధానిని మారుస్తున్నామని వైసీపీ నేతలు పదేపదే చెబుతున్నారని... ఢిల్లీ నుంచి తాను చెపుతున్నానని... మూడు రాజధానులతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పవన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలకు చెపుతున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు.
ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకపోతే... రాబోయే రోజుల్లో అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని పవన్ హెచ్చరించారు. అమరావతి రైతులు, మహిళలను దారుణంగా కొట్టారని... కేంద్ర మంత్రితో జరిగిన చర్చలో ఈ విషయం కూడా చర్చకు వచ్చిందని తెలిపారు. బీజేపీ నేతలు, తామంతా కూర్చోని చర్చించి, బలమైన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.