Prof Kasim: కాశిం తన చర్యలు కప్పిపుచ్చుకునేందుకే ప్రొఫెసర్ వృత్తి... రిమాండ్ రిపోర్ట్ లో ఆసక్తికర విషయాలు!
- జనవరి 18న కాశింను అరెస్ట్ చేసిన పోలీసులు
- మావోయిస్టులతో సంబంధాలున్నట్టు గుర్తింపు
- మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రిమాండ్ రిపోర్ట్!
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్నిరోజుల క్రితం సిద్ధిపేటలో ప్రొఫెసర్ కాశింను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉస్మానియా వర్సిటీ అనుబంధ ఆర్ట్స్ కాలేజీ తెలుగు డిపార్ట్ మెంట్ లో కాశిం అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు మావోయిస్టు రాష్ట్ర, కేంద్ర కమిటీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ప్రొఫెసర్ కాశిం రిమాండ్ రిపోర్ట్ అంటూ మీడియాలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.
మీడియా కథనాల ప్రకారం.... జనవరి 18న కాశింను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నట్టు విచారణలో ప్రొఫెసర్ కాశిం ఒప్పుకున్నారు. మల్లోజుల వేణుగోపాల్, కటకం సుదర్శన్, పుల్లూరి ప్రసాదరావు, హరిభూషణ్ లతో కాశిం టచ్ లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. కాగా, కాశిం, అతని భార్య 'నడుస్తున్న తెలంగాణ' అనే పత్రిక ప్రచురణను నిర్వహిస్తున్నారు. ఈ పత్రికను నడిపేందుకు మావోయిస్టు పార్టీ నుంచి ప్రతినెల కాశింకు నిధులు అందుతున్నట్టు గుర్తించారు.
మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు 19 సంస్థలు మావోయిస్టులకు అనుబంధంగా పనిచేస్తున్నాయని, ఆ అనుబంధ సంస్థలకు కాశిం సమన్వయకర్తగా పనిచేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టులకు అవసరమైన కంప్యూటర్లు, ఆయుధాలు ఏర్పాటు చేయడంలో కాశిం ఆరితేరాడని వెల్లడించారు. తన చర్యలను కప్పిపుచ్చుకునేందుకే ప్రొఫెసర్ వృత్తిలో వున్నాడని తెలిపారు. కాశిం నివాసంలో 118 డాక్యుమెంట్లు, 163 సీడీలు, 5 డిజిటల్ వీడియో కేసెట్లు, 4 పెన్ డ్రైవ్ లు, మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కాశిం భార్య స్నేహలతపై 'ఉప్పా' చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.