Botsa Satyanarayana Satyanarayana: మండలి చరిత్రలో ఇది బ్లాక్ డే.... ఇలాంటి చైర్మన్ల వల్ల వ్యవస్థలకే విఘాతం: బొత్స ఫైర్
- సెలెక్ట్ కమిటీ ముందుకు వికేంద్రీకరణ బిల్లు
- విచక్షణాధికారం ఉపయోగించిన మండలి చైర్మన్
- చైర్మన్ పై నిప్పులు చెరిగిన బొత్స
ఐదు కోట్ల మందికి ఉపయోగపడే రెండు బిల్లులను శాసన వ్యవస్థల ముందు పెడితే, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ టీడీపీ సభ్యులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు నిర్ణయించడంతో బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలి మీడియా పాయింట్ వద్ద ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతూ, ఇది శాసనమండలి చరిత్రలో బ్లాక్ డే అని, మాయని మచ్చ అని పేర్కొన్నారు. రాజ్యాంగానికి, నిబంధనలకు లోబడి వ్యవహరించలేదని, చైర్మన్ కు ఇది మచ్చగా మిగిలిపోతుందని అన్నారు.
బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినందువల్ల జాప్యం జరుగుతుందేమో తప్ప టీడీపీ సాధించేదేమీ లేదని అన్నారు. ప్రభుత్వానికి కూడా విచక్షణాధికారాలు ఉంటాయని, విచక్షణాధికారాలు ఉన్నాయి కదా అని సభ్యత, సంస్కారాలు లేకుండా చట్టాన్ని చూసుకోకుండా ఉపయోగించడం సమంజసం అనిపించుకోదని విమర్శించారు. చంద్రబాబు లాబీల్లో కూర్చుని చూడడంపైనా బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది రాక్షస ఆలోచన అని, జాప్యం చేయాలని నీతి మాలిన కార్యక్రమాలకు తెరలేపారని మండిపడ్డారు. ఇలాంటి శాసనమండలి చైర్మన్లు ఉంటే ఈ వ్యవస్థకే చేటు అని, ఇలాంటి వాళ్లు ఉంటే రాజ్యాంగానికి ఇబ్బందులొస్తాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సైతం ఇలాంటి చైర్మన్ల వల్ల విఘాతం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఎలాంటి పరిస్థితుల్లో విచక్షణాధికారం ఉపయోగించాలో తెలియకపోతే ఎలా? మీ బాస్ చెప్పాడని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తావా? ఆయనకైనా సిగ్గు శరం ఉండాలి కదా, అక్కడ కూర్చుని తతంగం జరిపించడానికి! మీ బుద్ధేమైంది? నేను ఎన్నో సభలు చూశాను. ఎక్కడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. మళ్లీ నీతులు చెబుతారు కానీ చేసేవి ఇలాంటి పనులా? ఇప్పటికే ప్రజలు వ్యతిరేకించిన చంద్రబాబు మేం విచక్షణాధికారాలు ఉపగియోస్తే ఒక్క నిమిషం కూడా రాజకీయాలు చేయలేడు. మండలిలో ఇవాళ జరిగిన పరిణామాలకు చంద్రబాబు, చైర్మన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారు" అంటూ నిప్పులు చెరిగారు.