Chandrababu: జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
- నీవు, నీ తండ్రి రాయలసీమకు చేసిందేమిటి?
- హెరిటేజ్ భూములు కొన్నది రాజధాని ప్రాంతంలో కాదు
- పాలన వదిలేసి.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు
మాట్లాడితే రాయలసీమ అని చెప్పుకుంటున్నారని... నీవు, నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు చేసిందేమిటని సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమకు నీరు తీసుకొచ్చింది ఎవరని ప్రశ్నించారు. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరిని ఎన్టీఆర్ ప్రారంభిస్తే... తాను వాటిని పూర్తి చేశానని చెప్పారు.
కియా మోటార్స్, రిలయన్స్ హార్డ్ వేర్ పార్క్, హీరో మోటార్స్, అపోలో టైర్స్, టీసీఎల్ సహా 50కి పైగా కంపెనీలను రాయలసీమకు తాను తీసుకొచ్చానని తెలిపారు. తానూ రాయసీమవాసినే అని... శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీలో చదువుకున్నానని... నీవు ఎక్కడ చదివావు? నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటని ప్రశ్నించారు. జాతీయ మీడియా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఎనిమిది నెలల పాలనలో ఏమీ చేయకపోగా... పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అమరావతి ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోందని... హెరిటేజ్ ఒక వ్యాపార సంస్థ అని, నాగార్జున యూనివర్శిటీ సమీపంలో కొంత భూమిని కొంటే అందులో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యాపారం కోసం ఏ సంస్థ అయినా భూములు కొనవచ్చని చెప్పారు. హెరిటేజ్ భూములు కొన్నది సీడ్ క్యాపిటల్ ఏరియాలో కాదని అన్నారు.
వ్యాపార విస్తరణలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా హెరిటేజ్ భూములను కొంటుంటుందని... ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రతి రోజు హెరిటేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో హెరిటేజ్ కోసం తాను ఎలాంటి ఫేవర్ చేయలేదని... కానీ సీఎం అయిన తర్వాత భారతీ సిమెంట్స్ కు జగన్ చాలా చేశారని విమర్శించారు.