Chandrababu: మీడియాపై నిర్భయ కేసులా..? సీఎం తిక్క చేష్టలతో రాష్ట్రం పరువుపోతోంది: చంద్రబాబు
- సీఎం జగన్ పై చంద్రబాబు ధ్వజం
- కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం
- నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యలు
రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని, మీడియా స్వేచ్ఛను హరించే నియంతృత్వ వైఖరులను తాము ఖండిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మీడియాపై నిర్భయ కేసులు బనాయించడం ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు పరాకాష్ఠ అని మండిపడ్డారు.
తరగతి గదుల్లో పోలీసులు దుస్తులు ఆరేసిన ఘటనను ఫొటోలు తీసినందుకు విలేకరులపై కేసులు నమోదు చేయడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించారు. తునిలో విలేకరి హత్య జరిగిందని, చీరాలలోనూ ఓ మీడియా ప్రతినిధిని చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఓ పత్రిక ఎడిటర్ పై దాష్టీకానికి పాల్పడ్డారని విమర్శించారు. అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్ నిరంకుశ విధానాలు, తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి నియంతలంతా కాలగర్భంలో కలిసిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.