Nara Lokesh: జగన్ ఇంత దిగజారి పోతారనుకోలేదు... సిగ్గుందా అని అడుగుతున్నా!: నారా లోకేశ్
- మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులేంటన్న లోకేశ్
- రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకే ఇలాంటి చర్యలని మండిపాటు
- జగన్ వి పిచ్చిచర్యలని విమర్శలు
ఏపీలో మీడియాపై కేసులు పెట్టడాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీనిపై ఘాటుగా స్పందించారు. 'సీఎం జగన్ మరీ ఇంత దిగజారిపోతారనుకోలేదు, రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు మీడియాపై తప్పుడు కేసులు బనాయిస్తారా? మీకసలు సిగ్గుందా?' అంటూ మండిపడ్డారు.
విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాల తరగతి గదులను ఆక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పరిస్థితిని, దానిపై తల్లిదండ్రుల ఆందోళనను ప్రపంచానికి చూపించినందుకు మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెట్టారంటే మీ 8 నెలల పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతుందని అంటూ విమర్శించారు.
అయినా, మీడియా స్వేచ్ఛను హరించాలని ప్రయత్నం చేసిన ప్రతి నియంత కాలగర్భంలో కలిసిపోయారని నారా లోకేశ్ స్పష్టం చేశారు. "2430 జీవో ద్వారా మీ నియంతృత్వ ధోరణిని చాటుకున్నారు, ఇప్పుడు మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం ద్వారా మీ భయమేంటో వెల్లడైంది. జగన్ గారి పిచ్చి చర్యలను ఖండిస్తున్నా. మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి" అంటూ డిమాండ్ చేశారు.