Telugudesam: ఎల్లుండి టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నాం: చంద్రబాబునాయుడు
- ఈ ఉన్మాద ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చిస్తాం
- మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం
- అభివృద్ధిని ఆకాంక్షించే వారు మూడు రాజధానులను సపోర్టు చేయరు
ఎల్లుండి టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరితో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఉన్మాద ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయమై ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, వ్యూహరచన చేస్తామని అన్నారు.
ధర్మం, న్యాయమే అల్టిమేట్ గా గెలుస్తుంది
ఫోర్త్ ఎస్టేట్ (మీడియా) ను చంపేసిందని, కోర్టులను కూడా బెదిరించే పరిస్థితికి వస్తోందని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన కేసును ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది ముకుల్ రోహిత్గికి ఐదు కోట్ల రూపాయలు ఇస్తారా? పేద రాష్ట్రమని చెబుతున్న సీఎం జగన్ అతనికి ఐదు కోట్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. ‘ధర్మం, న్యాయం అల్టిమేట్ గా గెలుస్తుంది. అధర్మం, అన్యాయం తాత్కాలికం. అభివృద్ధిని ఆకాంక్షించే ఏ వ్యక్తి అయినా మూడు రాజధానులను ఎక్కడా సపోర్టు చేయడు’ అని అన్నారు.