Shamshabad: ప్రయాణికుల మలద్వారంలో బంగారం.. శస్త్రచికిత్స చేయించి బయటకు తీయించిన పోలీసులు!
- శంషాబాద్‌లో భారీగా పట్టుబడిన బంగారం
- 4,083 గ్రాముల బంగారం పట్టివేత
- దుబాయ్ నుంచి వివిధ రూపాల్లో అక్రమ రవాణా
హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 4,083 గ్రాముల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.1.66 కోట్లు ఉంటుందని అంచనా. గురువారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 840 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. మరో ప్రయాణికుడిని నుంచి రెండు బంగారం బిస్కెట్లు, దుబాయ్ నుంచి వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వీరిలో ఒకరు పైపుల్లో దాచి బంగారం తరలిస్తుండగా, మరొకరు మైక్రోవేవ్ ఓవెన్ ట్రాన్స్‌ఫార్మర్‌లో బంగారం బిస్కెట్లు దాచాడు. పట్టుబడిన మరో ముగ్గురు బంగారం పేస్ట్‌ను క్యాప్సూల్స్‌గా మార్చి మలద్వారంలో పెట్టుకున్నట్టు గుర్తించి ఆపరేషన్ చేసి బయటకు తీయించారు. మొత్తం కోటీ అరవై ఆరు లక్షల రూపాయల విలువైన 4,083 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.