Telugudesam: అందుకే జగన్ కలవరపడుతున్నారు!: వర్ల రామయ్య
- మండలి రద్దుపై తీర్మానం చేస్తే బుట్టదాఖలవుతుంది
- జగన్ కు తోటి ముద్దాయి నిమ్మగడ్డ ప్రసాద్
- శక్తి యుక్తులను రాజధాని విభజనలపై కాక రాష్ట్రాభివృద్ధికి ఎప్పుడు వాడతారు
వైసీపీ ప్రభుత్వ నేతలపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన టీడీపీ సభ్యులను మార్షల్స్ ఎత్తుకెళ్లి బయటకు తీసుకుపోయే ఏర్పాటు చేయాలన్న జగన్ వ్యాఖ్యలపై వర్ల మండి పడ్డారు.
మరి మండలి సమావేశంలో ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ మంత్రులు చేసిన పని ఏంటని నిలదీశారు. మండలిలోకి 22 మంది మంత్రులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయం తత్తరపాటు చర్యని గుర్తించి జగన్ కలవరపడుతున్నారన్నారు. మండలిలో తమ నిర్ణయాన్ని నెగ్గించుకోవడానికి అక్కడికి మంత్రులను పంపారని ఆరోపించారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే అది బుట్ట దాఖలవుతుందన్నారు.
తనపై నమోదైన కేసులపై విచారణ త్వరగా పూర్తి చేసుకోవాలని సీఎం జగన్ ఎందుకనుకోవడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిన్న కోర్టుకు వెళ్లకుండా జగన్ ఎందుకున్నారో? అని ప్రశ్నించారు. జగన్ తోటి ముద్దాయి నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో ఉన్నారన్నారు. వాన్ పిక్ కేసులో ఆయనపై ఫిర్యాదు నమోదు కావడంతో ఆయనపై సెర్బియా నిర్బంధం విధించిందన్నారు.
రాజధానిని ముక్కలు చేయడంపై మీ శక్తి యుక్తులను, తెలివితేటలను ఉపయోగిస్తే.. ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి వాటిని ఎప్పుడు ఉపయోగిస్తారని ప్రశ్నించారు. నిమ్మగడ్డ ప్రసాద్ విషయమై ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాంగ మంత్రి జై శంకర్ ను ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్లో రూ.834 కోట్లు పెట్టుబడి పెట్టారని, ఆయన్ను దేశంలోకి రప్పించాలంటూ ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా సీఎం జగన్ ను కలుస్తున్నారన్నారు.