KCR: వాళ్లకు గేమ్, మాకు టాస్క్... రంగంలోకి దిగామంటే రాక్షసులమే: సీఎం కేసీఆర్
- మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి
- సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
- పిచ్చికూతలను పట్టించుకోబోమని స్పష్టీకరణ
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో సీఎం కేసీఆర్ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, తమకు ఇంతటి ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఎంతో కష్టపడిన టీఆర్ఎస్ శ్రేణులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఫలితాలపై ఆయన స్పందిస్తూ, ఈ ఎన్నికలను విపక్షాలు ఓ గేమ్ లా తీసుకుంటే, తాము ఓ టాస్క్ లా భావించామని వెల్లడించారు. ఒక్కసారి తాము రంగంలోకి దిగితే రాక్షసులమేనని, పని పూర్తయ్యేవరకు విశ్రమించబోమని కేసీఆర్ ఉద్ఘాటించారు.
అన్ని స్థాయుల్లో నేతలు, కార్యకర్తలు ఎంతో సమన్వయంతో పనిచేయడంతో ఈ విజయం సాకారం అయిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము చేసిన ఖర్చు కేవలం రూ.80 లక్షలు మాత్రమేనని, అది కూడా పార్టీ మెటీరియల్ పంపేందుకు ఖర్చు చేశామని వెల్లడించారు. దీనిపైనా విపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని సూచించారు. ఇలాంటి వాళ్ల పిచ్చికూతలను తాము పట్టించుకోబోమని, ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేస్తామని చెప్పారు.
తన రాజకీయ జీవితంలో ఓ పార్టీ పట్ల ప్రజలు ఇంత సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించడం ఎక్కడా చూడలేదని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ వేవ్ చూశానని, ఇందిరాగాంధీ ప్రభంజనం కూడా చూశానని, కానీ ఓ పార్టీ పట్ల, ఓ నాయకత్వం పట్ల ఇలాంటి స్థిరమైన అభిమానం ఎక్కడా చూడలేదని సంతోషం వ్యక్తం చేశారు. తమ బాధ్యతను ఈ విజయం మరింత పెంచిందని, టీఆర్ఎస్ నేతలు గర్వం తలకెక్కించుకోవద్దని హితవు పలికారు.