YSRCP: 'ఈనాడు'లో తప్పుడు కథనాలు రాస్తున్నారు: రామోజీరావుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం
- 1983లో మండలి రద్దుకు రామోజీరావు సమర్థించారు
- ఇప్పుడు జరుగుతోన్న పరిణామాలను రామోజీరావు సమర్థిస్తున్నారా?
- మండలిలో నిబంధనలను తుంగలో తొక్కడం రామోజీరావుకి కనపడట్లేదా?
- మండలి రద్దయితే లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయం
ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని 'ఈనాడు'లో తప్పుడు కథనాలు రాస్తున్నారని వైసీపీ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లితో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1983లో మండలి రద్దుకు అంకురార్పణ చేసినప్పుడు రామోజీరావు సమర్థించారని చెప్పారు. ఇప్పుడు జరుగుతోన్న పరిణామాలను రామోజీరావు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు.
మండలిలో నిబంధనలను తుంగలో తొక్కడం రామోజీరావుకి కనపడట్లేదా? అని బొత్స నిలదీశారు. మండలి రద్దయితే లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని, ఎందుకంటే లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడని అన్నారు.
స్వార్థ ప్రయోజనాలే తప్ప చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవని బొత్స అన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్.. టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లలాంటి వారని చెప్పారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను ఎలా కొన్నారో చూశామని, ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయాడో చూశామని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే వైసీపీకి తెలుసని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణపై చంద్రబాబుకి చిత్త శుద్ధి లేదని ఆయన అన్నారు. శాసన మండలిలో ప్రజాతీర్పును అపహాస్యం చేశారని చెప్పారు. సూచనలు చేయాల్సిన మండలి నిబంధనలను తుంగలో తొక్కిందన్నారు.
మండలి అవసరమా? లేదా? అన్న చర్చ రాష్ట్ర మంతా జరుగుతోందని చెప్పారు.