Amaravati: ప్రధాని మోదీని కలుస్తాం..అమరావతిని తరలించొద్దని కోరతాం: శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి
- అమరావతిలో కాలభైరవ మహా యాగం ముగిసింది
- ఈ సందర్భంగా ఐదు తీర్మానాలు చేశాం
- ఈ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం: శివస్వామి
రాజధాని అమరావతిని తరలించవద్దంటూ రైతుల నిరసనలు, ఆందోళనలు నలభై రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలించకూడదని కోరుకుంటూ శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో శ్రీపాశుపత సంపుటీకరణ కాలభైరవ మహాయాగం ఈరోజుతో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగంలో రైతు కుటుంబాలు, అక్కడి ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో శివస్వామి మాట్లాడుతూ, రాజధానిగా అమరావతినే కొసాగించాలని, ‘జై అమరావతి’ నినాదంతో తిరుపతిలో లక్ష మందితో సభ నిర్వహించాలని, ప్రధాని మోదీని కలిసి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేయాలని, శ్రీకాకుళం జిల్లాలోని స్వామీజీలు, తిరుపతిలోని స్వామీజీలు పాదయాత్రలు నిర్వహించాలని, వేలాది మందితో సీఎం జగన్ నివాసానికి తరలివెళ్లి ఓ వినతిపత్రం సమర్పించాలని, రాజధాని తరలింపువల్ల తలెత్తే ఇబ్బందులు, నష్టాన్ని గురించి పట్టించుకోకుండా విజయవాడ, గుంటూరు పట్టణాల్లో కుంభకర్ణుల్లా నిద్రపోతున్న యంత్రాంగాన్ని నిద్రలేపేందుకు కరపత్రాలు పంపిణీ చేయాలని తీర్మానాలు చేసినట్టు వివరించారు.