Telugudesam: రేపు ఏపీ శాసనసభ జరగడమే తప్పు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- గురువారంతోనే సమావేశాలు ముగిశాయి
- మళ్లీ రేపు ఎలా నిర్వహిస్తున్నారు? అజెండా ఏంటి?
- ప్రభుత్వం తమ ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదు
రేపు జరగనున్న ఏపీ శాసనసభా సమావేశానికి దూరంగా ఉండాలని టీడీఎల్పీ ఈరోజు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఎందుకు దూరంగా ఉంటున్నారన్న విషయమై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, రేపు సమావేశం జరగడమే తప్పు, చట్ట వ్యతిరేక విధానం అని, బీఏసీ నిర్ణయం ప్రకారం గురువారంతోనే సమావేశాలు ముగిసినట్టు చెప్పారని గుర్తుచేశారు.ఆరోజుతో సమావేశాలు ముగిస్తే మళ్లీ రేపు ఎలా నిర్వహిస్తున్నారు? అజెండా ఏంటి? ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులు శాసనమండలికి వెళ్లాయని, అక్కడి అవి తిరస్కరించారా, సెలెక్ట్ కమిటీకి పంపించారా అన్నది వాళ్ల బాధ్యత అని, దానిపై అసెంబ్లీల్లో ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీకే పరిమితం కావాల్సిన స్పీకర్ మండలి చైర్మన్ గురించి కామెంట్ చేస్తారా? అని ప్రశ్నించారు. అందుకే, ప్రభుత్వం తీరును నిరసిస్తూ రేపటి సమావేశానికి వెళ్లకుండా తాము బాయ్ కాట్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
రేపటి సమావేశానికి తాము వెళ్లమని, ఒకవేళ వెళ్లినా తమ నిరసనలు తెలిపేందుకు మైకు ఇవ్వరని విమర్శించారు. ఒకవేళ శాసనమండలిని రద్దు చేయదలచుకుంటే కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టదలచుకుంటే కొంత సమయం ఇవ్వాలని, 48 గంటల తర్వాత దీనిపై చర్చించాలన్నది నిబంధనలు అని చెప్పారు. అంతేగానీ, తమ ఇష్టానుసారం తీర్మానం చేస్తామని, అసెంబ్లీలో చర్చకు పెడతామంటే కుదరదని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.