Sajjala: ఎప్పుడంటే అప్పుడే... 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు 'జంప్'కి సిద్ధంగా ఉన్నారన్న వైసీపీ నేత సజ్జల!
- జగన్ అంగీకరిస్తే పార్టీలోకి జంప్
- జగన్ మాత్రం విలువలకు కట్టుబడ్డారు
- ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం
తమతో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్సీల పరిస్థితి చెప్పనవసరం లేదని ఆయన అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన సజ్జల, జగన్ ఎప్పుడంటే అప్పుడు వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, విలువలకు, విశ్వసనీయ రాజకీయాలకు కట్టుబడిన తమ పార్టీ అధినేత, పార్టీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందేనన్న నిబంధన విధించారని చెప్పారు.
అయినా, పూర్తి బలమున్న తమ పార్టీ, వారందరినీ తెచ్చుకుని ఏం చేయాలని సజ్జల ప్రశ్నించారు. డబ్బిచ్చి ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ నవతరం నాయకుడైతే, చంద్రబాబు అంతరించిపోతున్న నేత అని విమర్శలు గుప్పించారు.
జగన్ సరేనంటే ఎంతమంది వస్తారో తనకన్నా బాగా మీడియాకే తెలుసునని సజ్జల చలోక్తులు విసిరారు. కౌన్సిల్ విషయం అసలు సమస్యే కాదని, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు అవుతారని అన్నారు. తన తండ్రి ఫొటో పక్కనే తన ఫొటో కూడా ఉండాలన్నదే జగన్ లక్ష్యమని, ఈ దిశగా ప్రజా సంక్షేమాన్ని ఆయన పరుగులు పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. పొరపాటున కూడా డబ్బులతో సీఎం వైఎస్ జగన్ రాజకీయాలు చేయరని అన్నారు.