Gudiwada Amarnath: హీరో కాదు... 13 జిల్లాలకు విలన్ అయ్యానని చంద్రబాబు గ్రహించలేకపోతున్నారు: గుడివాడ అమర్ నాథ్
- జగన్ కు ప్రజాప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యలు
- బాబు 3 గ్రామాలకే హీరో అయ్యాడని ఎద్దేవా
- మండలిలో బిల్లును అడ్డుకున్నంత మాత్రాన ఏమీకాలేదన్న అమర్ నాథ్
ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. శాసనమండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్ష టీడీపీ మండిపడుతుండగా, వైసీపీ నేతలు మాత్రం సమర్థిస్తున్నారు. తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా సీఎం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి ఇదే సరైన నిర్ణయం అని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు మండలిలో బిల్లును అడ్డుకుని హీరో అయ్యానని అనుకుంటున్నారని, వాస్తవానికి ఆయన 13 జిల్లాలకు విలన్ అయ్యానని గుర్తించలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు మండలిలో బిల్లును అడ్డుకున్నంత మాత్రాన ఏమీ కాలేదని, ఆయన కేవలం 3 గ్రామాలకు మాత్రమే హీరోగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరు చూస్తుంటే పొరుగుదేశంతో యుద్ధం చేస్తున్నట్టుగా ఉందని అమర్ నాథ్ వ్యాఖ్యానించారు.