KTR: పేరుకే ఢిల్లీ పార్టీలు కానీ, చేసేవన్నీ... చెబితే బాగుండదిక!: కేటీఆర్
- మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ప్రెస్ మీట్
- కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు
- చేసేవన్నీ సిల్లీ పనులేనంటూ వ్యాఖ్యలు
- అపవిత్ర అవగాహనకు పాల్పడ్డారని ఆగ్రహం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. తమ పట్ల ప్రగాఢ విశ్వాసం చూపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విపక్షాలు అనేక తిప్పలు పడ్డాయని, కొన్నిచోట్ల కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
"మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ చైర్మన్ పదవి చేజిక్కించుకుంటే, కాంగ్రెస్ మద్దతిచ్చింది.... మణికొండలో కాంగ్రెస్ కు చైర్మన్ పదవి, బీజేపీకి ఉపాధ్యక్ష పదవి వచ్చింది.... తుర్కయాంజాల్ లో కూడా ఇదే ఫలితాలు వచ్చాయి. పేరుకే ఇవి ఢిల్లీ పార్టీలు. చేసే పనులన్నీ.... చెబితే బాగుండదిక! చాలా సిల్లీ పనులవి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక చివరికి పొత్తు పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. ఇదొక అపవిత్రమైన అవగాహన అని ముందే చెప్పాం. ఇప్పుడది బయటికొచ్చింది. నిస్సిగ్గుగా, అన్నింటికి వారు తిలోదకాలిచ్చినప్పటికీ సంపూర్ణమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాం. కేవలం 8 మున్సిపాలిటీలు ప్రత్యర్థులకు కోల్పోయి, 112 మున్సిపాలిటీలు గెలుచుకున్నాం. పదింటికి పది కార్పొరేషన్లు గెలుచుకున్నాం. ఇదేమీ మామూలు విషయం కాదు. ఇది కలలో కూడా ఊహించనంత గొప్ప విజయం" అని పేర్కొన్నారు.