MAA: ‘మా’లో మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. నరేశ్ పై క్రమశిక్షణా సంఘానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఫిర్యాదు
- శివాజీ రాజాపై నరేశ్ తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు
- నరేశ్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఆరోపణలు
- 9 పేజీల లేఖ రాసిన సభ్యులు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో సభ్యుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏమైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సినీ పెద్దలు చెబుతున్నప్పటికీ గొడవలు సద్దుమణగడం లేదు. అంతేగాక, సభ్యుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మా అధ్యక్షుడు నరేశ్‌పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ కమిటీ సభ్యులైన సినీనటులు నటులు కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధకి 9 పేజీల లేఖ రాశారు.
మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై నరేశ్ తప్పుడు ఆరోపణలు చేశారని వారు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని సభ్యులు సంఘానికి విజ్ఞప్తి చేశారు. ‘మా’ అభివృద్ధికి నరేశ్ అడ్డంకిగా మారారని, అంతేగాక నిధులు దుర్వినియోగం చేయడం, ఈసీ సభ్యులను అవమానపర్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు.
ఆయన నిర్ణయాలతో 'మా' పూర్తిగా భ్రష్టుపట్టిపోతోందని ఆ లేఖలో ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ పేర్కొన్నట్లు తెలిసింది. ‘మా’ సభ్యులు ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదని ఆమె విమర్శించారు. క్రమశిక్షణా సంఘానికి మొత్తం 15 మంది ఈసీ సభ్యులు ఈ లేఖ రాశారు.
నరేశ్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని వారు ఆరోపణలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ సంఘానికి జీవిత విజ్ఞప్తి చేశారు. 'మా' క్రమశిక్షణా సంఘంలో కృష్ణంరాజు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధ ఉన్నారు.