Nirbhaya Case: జైల్లో నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారు: నిర్భయ దోషి

  • రాష్ట్రపతికి అన్ని రికార్డులను పంపించలేదు
  • క్షమాభిక్షను తిరస్కరించడం ఏకపక్షంగా జరిగిందన్న ముఖేశ్ సింగ్
  • రివ్యూ పిటిషన్ పై రేపు తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు

తనకు క్షమాభిక్షను ప్రసాదించే అంశంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పూర్తిగా మనసును కేంద్రీకరించలేదని సుప్రీంకోర్టుకు నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ తెలిపాడు. రాష్ట్రపతి క్షమాభిక్షను నిరాకరించడాన్ని సుప్రీంకోర్టులో అతను సవాల్ చేశాడు. ఈరోజు కోర్టు విచారణ సందర్భంగా ముఖేశ్ సింగ్ తరపు న్యాయవాది అంజన ప్రకాశ్ వాదిస్తూ... రాష్ట్రపతికి అన్ని రికార్డులను అధికారులు పంపించలేదని ఆరోపించారు. ఈ కారణం వల్లనే క్షమాభిక్షను తిరస్కరించడం ఏకపక్షంగా జరిగిందని తెలిపారు.

మొత్తం డాక్యుమెంట్లను రాష్ట్రపతికి పంపించాలని... జైల్లో తనను కొట్టారని, లైంగికంగా వేధించారనే విషయాన్ని తాను నిరూపించుకుంటానంటూ ముఖేశ్ సింగ్ చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా జస్టిస్ అశోక్ భూషణ్ స్పందిస్తూ, ప్రతి డాక్యుమెంట్ ను రాష్ట్రపతి క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ముందు అన్ని వాస్తవాలను సమర్పించలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారని అడిగారు. రాష్ట్రపతి మనసును కేంద్రీకరించలేదని మీరెలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు వాదనల సందర్భంగా అంజన మాట్లాడుతూ, ఒకరి జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని... సరైన కోణంలో ఆలోచించాలని కోరారు. జైల్లో ముఖేశ్ సింగ్ అనేక సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాడని తెలిపారు. క్షమాభిక్షను తిరస్కరించక ముందే ముఖేశ్ ను వేరే గదిలో ఒంటరిగా ఉంచారని... జైలు నిబంధనలకు ఇది విరుద్ధమని చెప్పారు.

వాదనలన్నీ విన్న తర్వాత... తమ తుది నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని సుప్రీంకోర్టు తెలియజేసింది. మరోవైపు, ఫిబ్రవరి 1వ తేదీన నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News